26/05/2021
• ఆరోగ్యాన్ని పండిద్దాం!
డాబా మీద ఖాళీ జాగాలోనో... అక్కడా అవకాశం లేదంటే బాల్కనీలోనో కూరగాయలు, పూల మొక్కల్ని ఎంచక్కా పెంచేసుకోవచ్చు.
కావాల్సిందల్లా కాస్త శ్రమ, ఇంకాస్త శ్రద్ధ..!!
టొమేటో, వంగ, బెండ లాంటి కూరగాయలు, తోటకూర, గోంగూర, బచ్చలి, పుదీన, కొత్తిమీర తదితర ఆకుకూరలు సునాయాసంగా కుండీల్లో పెంచుకోవచ్చు. నీళ్ల తొట్టి లేదా కొద్ది పాటి పెద్ద కుండీలు తీసుకుంటే సొర, పొట్ల, దోస, కాకర మొదలైన తీగపాదులను పెంచి బాల్కనీ గ్రిల్లుకు పాకించవచ్చు. తాజా కూరగాయలతో పాటు చల్లదనాన్నీ ఆస్వాదించవచ్చు.
ఇక మల్లె, మందారం, గులాబి, చేమంతి లాంటి పూల మొక్కలెన్నిటినో కొద్ది జాగాలోనే అవలీలగా పెంచుకోవచ్చు.ఈ మొక్కలన్నింటికీ క్రమం తప్పకుండా నీళ్లు పోయడం, అప్పుడప్పుడూ మట్టిని కాస్త గుల్ల చేయడానికి మించి ప్రత్యేకమైన పోషణ ఏమీ అవసరం లేదు. కూరగాయల, టీపొడి వ్యర్థాలను మొక్కల మొదళ్లలో వేస్తే మరింత ఏపుగా పెరుగుతాయి. ఉన్న కొద్ది స్థలంలోనే రసాయన ఎరువుల్లేని ఆర్గానిక్ కాయగూరలు పండించి ఆరోగ్యాన్నీ, ఆత్మతృప్తినీ పొందొచ్చు.